వ్యక్తిగత శుభ్రత పాటించండి: హీరో యశ్‌

ఈ ఏడాది తన భార్య రాధికా పండిట్‌ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం లేదని కన్నడ రాక్‌స్టార్‌, కేజీఎఫ్‌ హీరో యశ్‌ తెలిపారు. ప్రాణాంతక కోవిడ్‌-19(కరోనా వైరస్‌) వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అదే విధంగా ప్రతీ ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని.. అప్పుడే ప్రమాదకరమైన వైరస్‌ బారిన పడకుండా ఉంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం కేజీఎఫ్‌: చాప్టర్ 2 సినిమాతో బిజీగా ఉన్న యశ్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. షేక్‌హ్యాండ్‌ బదులు నమస్తే చెప్పాలని.. జలుబు, దగ్గుతో బాధపడుతున్నట్లయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి సూచనలు, సలహాలు పాటించాలని పిలుపునిచ్చారు. అంతేగాకుండా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టేంతవరకు బహిరంగ ప్రదేశాల్లో సంచరించడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో రాధిక బర్త్‌డే సెలబ్రేషన్స్‌ రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.